Sunday, May 9, 2010

కొండ అద్దమందు

ఊరేగే ఆశలతో ఊగిసలాడోద్దోయ్
ఉత్తుత్తి ఆశలతో ఎదనంతా నింపద్దోయ్

ఓనమాలు నేర్వగనే ఓంకారం అందినట్టు
ఊరంతా తిరిగి నువ్వు వీరంగం వేయొద్దు

తెలిసిందే కొంతయని తెలియంది కొండయని
నిజమెరిగిన నాడే నీకు జయములు దొరికేనన్ని

కొండయద్దమందు కొంచమై యుండేనంట
ఆ తీరుగా నీవు కూడా మసలితే మంచిదంట

నేను గొప్పయనుచు నువ్వు ఊరంతా అరచినంత
నిన్ను గొట్టు గురుడు వేరోక్కడు యుండేనంట

బొట్టు బొట్టు అందుకొని కుండనంతా నింపుకో
ఇంతింతై వటుడంతై బ్రహ్మాండం గెలుచుకో

Sunday, May 2, 2010

సాధ్యం

ఎందుకని ఈ నిష్ఠూరం
ఎందుకని అప్రియవదనం
ఎందుకని వైరాగ్యం
ఎందుకని నిర్వేదం

జరగలేదు పెనుఘోరం
జరిగెను చిరుజాప్యం
అంతులేని నైరాశ్యం
కాగాలదులే కాళవిషం

కాము మనం అనిమిషులం
వేచి చూడు ఒక నిమిషం
కలిగేనులే అతి హర్షం
కురిసేనులే సుధా వర్షం

ఓర్పు సహనం సడలని ఆత్మ స్థైర్యం
కష్టాలను కరిగించగా కావాలి మనోధైర్యం
పూరించుము పాంచజన్యం
చేసుకో జన్మ ధన్యం

వాన

నింగినున్ననీలిమబ్బే నేలవంక తొంగిచూసే
ఎండ మంటల మండినట్టి బీటవారిన గుండె చూసే
సందడన్నదే లేని పొలమును కన్నులార్పక మరీ చూసే
గుండె బరువును మోయలేక ఎదనున్న గంగను వదిలివేసే

వానోచ్చిందోయ్ మామ వరదోచ్చిందోయ్
ఒళ్ళు పులకరించగా సరదా తెచ్చిందోయ్
వేయి కళ్ళ నిరీక్షణలు నేటితోనే తీరిపోగా
భువి ఓడిన వాలిపోయి సరదా చేసింది

చెరువులోన నీరుంది చేలకు కూడా నీరుంది
భూమిలోన నీరుంది బ్రతుకు బరువు తీరింది
చురికి ఉన్న నేలమ్మక్కు చక్కిలిగిలి పుట్టింది
బోసిపోయిన రైతన్నకు నవ్వు తెచ్చిపెట్టింది

బుడుగులంతా రారండోయ్ గోడుగులోదిలి రారండోయ్
పడవలోదిలి చూద్దాము గొడవ గొడవ చేద్దాము
పెద్దలంతా ఇప్పుడు పిల్లలైపోవండి
పరవశించి వానలోన పులకరించిపోవండి

గోరంత దీపం

వెలిగేటి దివ్వెను వెలుగులో వేలుగీయలేదనుచు వేలెత్తి దానిని నిందించనేల
వలయు చీకట్లు కనుగొని అచ్చోట నిలిపిన ఆ వెలుగే మనకు కనిపించు చాల

జడివాన కురియగా నదులు జలజలా పారగా ఆ జలధారనంతా జారవిడువనేల
జలముకై పుడమినే గుచ్చి గుచ్చి భూజల జాడనే తుడిచిపెట్టనేల

తడినేల ఓ వైపు పొడినేల ఓ వైపు నిలిచేతి ఈ వింత వైనమింకెంతసేపు
తడి నిలువ చేసుకొని దారినే మార్చగా పొడి గొంతు తడిసి మరుభూమి విరియగా ఇంకెంతసేపు

ఆకలి మించిన భోజనం బడలిక మించిన శయనం ఓ వైపు ఇది కనువిందు చేసేటి
ఆ కలి మీరి బువ్వ దొరకక నిదుర మరిచేరు కొందరు మరు వైపు ఇది కాన్చాగా హృదయమే ఛిద్రం

అవసరం గాంచి సమతౌల్యం సాధిద్దాం

అవనిలో జనులెల్ల సమమేనని చాటుదాం

అభిలాష

ఆలోచనలు రణము సేయ
అభిలాషలు పణము కాగా
ఆవేదనకు కారణమై
అశ్రువులు అలలు కాగా

అణిగిన ఓ అభిమతముకు
అలిగెను ఓ అరనేత్రం
ఆసహించిన ఓ ఆశయాన్ని
అలసత్వము అణగదొక్కే

అలసిన మనసులోన
అరిగిన భావములెన్నో
ఆక్రోశములో మనసు ఉంది
ఆలోచనలో తమసు నిండి ఉంది

అలుపెరుగని ఈ రణం
అభిరుచుల సాధనకే
అరుదుకాని ఆ తరుణం
అపురూపమైన అనుభవం

ఎవరు నేను

ఎవరు నేను ఎవరు నేను
నా నేనే ఓ ప్రశ్నార్థకం
కాదు కాదు నిప్పు కణం
సైకత సాగరాన చిన్న కణం
మిడిసి పడకు అనుక్షణం
వదలవద్దు విచక్షణం
నీ చక్షువులకు కానవచ్చు
భువనమేంతో సూక్ష్మం
నీ హద్దెరిగి మసలుతయే
ఎన్నటికీ ఉత్తమం

నాకంటూ ఓ లోకం
అందులో నాదే రాజ్యం
నిన్నటి నీతో పోటీ
రేపటి నీవే సాటి
నిన్నటి నిసితో సమరం
రేపటి వెలుగే బహుమానం
నీ శ్వాసే ఇంధనం
నీ ఊహదే గమనం
నీ ఆశయమే నీ గమ్యం
నీ శ్రమయే నీ దైవం
నీవే నీకున్న ఆధారం
తెరువవోయి నూతన అధ్యాయం